విదేశీ భాషలు, ముఖ్యంగా జర్మన్ భాషను నేర్చుకునే విద్యార్థులు క్రమశిక్షణ, నిరంతర సాధనతో ముందుకు సాగితే అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సూచించారు.
సోమవారం టామ్కామ్ (TOMCOM) కార్యాలయంలో జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో మంత్రి సమావేశమయ్యారు. జర్మనీలో ఉద్యోగాలు పొందాలనే లక్ష్యంతో ఉన్న యువత కోసం టామ్కామ్ జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. జర్మనీలో లభించే అధిక వేతనాలను దృష్టిలో ఉంచుకొని, యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రారంభించిన జర్మన్ భాషా తరగతులకు విశేష స్పందన లభించిందని, 200 మంది యువత ఈ కోర్సులో చేరడం ఆనందదాయకమని మంత్రి పేర్కొన్నారు. విదేశీ ఉపాధి అవకాశాలను పొందడంలో భాషా ప్రావీణ్యమే ప్రధాన అడ్డంకి అని, దానిని అధిగమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యార్థులు సమర్థవంతంగా భాషను నేర్చుకునేలా వారి హాజరును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో తరగతులకు హాజరై భాషపై పూర్తి పట్టు సాధించాలని మంత్రి సూచించారు. నిరంతర అభ్యాసమే ఏ భాషనైనా నేర్చుకోవడంలో విజయానికి మూలమని ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ వివరించారు.
ఇలాంటి భాషా శిక్షణ కార్యక్రమాలు యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన కెరీర్ను నిర్మించుకునేందుకు దోహదపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.








