మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాకతీయ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని, సంబంధిత విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మందమర్రిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. పాఠశాల యాజమాన్యం బిల్డింగ్ లీజు అగ్రిమెంట్ లేకుండానే, ఇతర శాఖల నుంచి అనుమతులు పొంది అధికారులను తప్పుదోవ పట్టించిందని వారు ఆరోపించారు. బిల్డింగ్ లీజు అగ్రిమెంట్ లేకపోయినా NOC సర్టిఫికెట్లు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
పాఠశాల అనుమతుల విషయంలో అధికారులకు లంచాలు ముట్టాయని, క్షుణ్ణంగా పరిశీలించకుండానే OP పర్మిషన్లు ఇవ్వడం ఏంటని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. పాఠశాల భవనం ముఖ్యమా లేక NOCలు ముఖ్యమా అని నిలదీశారు.
యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధ్యులైన మండల విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, విద్యాశాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.












