టామ్కామ్ ఆధ్వర్యంలో జర్మనీలో శిక్షణ పొందుతున్న నర్సులతో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ముఖాముఖి నిర్వహించారు. జర్మన్ భాషపై పట్టు సాధిస్తే ప్రపంచ స్థాయి అవకాశాలు లభిస్తాయని ఆయన నర్సులకు సూచించారు.
హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి నర్సులతో మాట్లాడుతూ, జర్మనీలో పనిచేయడం ఒక పెద్ద అవకాశం, అదే సమయంలో ఒక సవాల్ అని పేర్కొన్నారు. కొత్త భాష, వాతావరణం, విధానాలకు అలవాటు పడటం అవసరమని, అయితే కష్టపడితే విజయం సాధించవచ్చని తెలిపారు.
నర్సులు రోగులకు ఇచ్చే ధైర్యం, నమ్మకం వైద్యంలో కీలకమని, వారి పాత్ర గొప్పదని మంత్రి ప్రశంసించారు. టామ్కామ్ ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పిస్తున్నామని, ఈ బ్యాచ్ నర్సులు జర్మనీలో ప్రతిభ చూపితే, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెలంగాణ యువతకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జర్మన్ భాషపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ, వైద్యుల సూచనలను రోగులకు సరిగ్గా అందించడానికి కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యమని మంత్రి చెప్పారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా, కమ్యూనికేషన్ నైపుణ్యాలను సమర్థంగా ఉపయోగించుకుంటే గొప్ప విజయాలు సాధించవచ్చని ఆయన తన వ్యాపార అనుభవాలను ఉటంకిస్తూ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం టామ్కామ్ కార్యక్రమాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించిందని, రాష్ట్రంలో మరిన్ని నర్సింగ్ కళాశాలలు, సీట్ల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. లేబర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కమిషనర్ హరిచందన, టామ్కామ్ డైరెక్టర్ కాంతి వేస్లీ కూడా భాషా ప్రాముఖ్యత, అవకాశాలపై నర్సులకు మార్గనిర్దేశం చేశారు.












