తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ () పథకం కింద విద్యార్థులకు సేవలందిస్తున్న మంచిర్యాల జిల్లాలోని పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. గత మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు 7 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండటంతో పాఠశాలల నిర్వహణ భారంగా మారిందని యాజమాన్యాలు తెలిపాయి.
నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, ఇతర సౌకర్యాలను అందిస్తున్న పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనే నమ్మకంతో తమ సొంత డబ్బులతో, అప్పులు చేసి, ఇతర మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్య, భోజనం, వసతి సౌకర్యాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు, వంటగ్యాస్, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఖర్చులు, హాస్టల్ నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయని, అదేవిధంగా ఉపాధ్యాయులు, వార్డెన్లు, వంట సిబ్బంది, ఇతర ఉద్యోగుల జీతభత్యాల భారం కూడా పెరిగిందని యాజమాన్యాలు పేర్కొన్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వ బిల్లులు పెండింగ్లో ఉండటంతో పాఠశాలల యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి, కనీసం విద్యార్థులకు ప్రతిరోజూ భోజనం అందించడానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో, యాజమాన్యాలు ప్రభుత్వాన్ని పలు డిమాండ్లతో కోరాయి. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పథకానికి సంబంధించిన అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలని, 202627 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసికం ( ) బిల్లులను కూడా తక్షణమే చెల్లించాలని కోరాయి. విడుదల చేసిన నిధులు నేరుగా సంబంధిత పాఠశాలల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో బిల్లులను నిర్ణీత గడువులోగా క్రమం తప్పకుండా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ఇది విద్యార్థులపై తమకు ఉన్న బాధ్యతను విస్మరించి తీసుకుంటున్న నిర్ణయం కాదని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందకపోయినా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ హాస్టళ్లను నిర్వహించామని తెలిపాయి. కానీ ప్రస్తుతం తమ ఆర్థిక వనరులన్నీ పూర్తిగా ఖర్చయిపోవడంతో ఇకపై అప్పులు చేసి హాస్టళ్లను నిర్వహించే పరిస్థితి లేదని పేర్కొన్నాయి.
విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకూడదన్నదే తమ ప్రధాన ఉద్దేశమని యాజమాన్యాలు తెలిపాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరుతున్నాయి. ఒకవేళ దసరా సెలవులలోగా బిల్లులు విడుదల చేయడం సాధ్యం కాని పరిస్థితి ఉంటే, విద్యార్థుల విద్యాభ్యాసానికి, వసతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాంఘిక సంక్షేమ శాఖ తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశాయి. గౌరవ ముఖ్యమంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి పాఠశాలల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాల తరఫున కోరుతున్నామని తెలిపారు. విద్యార్థుల సంక్షేమాన్ని, పాఠశాలల మనుగడను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాయి.










