ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లోని గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన ఈ విషయాలు తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం చందనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో, లక్షెట్టిపేట మండలం లింగాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో మండల తహసిల్దార్, బి-విభాగం పర్యవేక్షకులు, ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఎ.డి., మండల తహసిల్దార్ లతో కలిసి అదనపు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ భూ రికార్డుల వివరాలను పరిశీలించడం, సంబంధిత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. భూముల రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని, గ్రామస్థుల భాగస్వామ్యంతో సర్వే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పాత భూ రికార్డులలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, భూముల విస్తీర్ణం, హద్దులు, యాజమాన్య వివరాలకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. రీ-సర్వే ద్వారా ప్రతి భూమిని క్షేత్రస్థాయిలో కొలిచి, సాంకేతిక పరికరాల సహాయంతో హద్దులను నిర్ధారించి, వాస్తవ విస్తీర్ణాన్ని నమోదు చేసి, సంబంధిత రికార్డులు, మ్యాపులను సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల సరిహద్దులలోని ప్రభుత్వ భూములు, ఇతర భూముల ఆక్రమణలకు సంబంధించిన సమస్యలను రీ-సర్వే ద్వారా గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీ-సర్వే నిర్వహించే తేదీకి సంబంధించి భూయజమానులకు ముందుగానే నోటీసులు అందజేస్తామని, నోటీసులో పేర్కొన్న తేదీన భూయజమానులు తప్పనిసరిగా తమ భూముల వద్ద అందుబాటులో ఉండాలని, వాస్తవ హద్దులను సర్వే సిబ్బందికి చూపించి, రికార్డులలో నమోదైన విస్తీర్ణం, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. తద్వారా భూముల హద్దుల విషయంలో తలెత్తే వివాదాలను తగ్గించడంతో పాటు, భూముల యాజమాన్య వివరాలను స్పష్టంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












