సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, లాభాల వాటా, బోనస్ చెల్లింపు వంటి డిమాండ్లపై ఏఐటియుసి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ నెల 13న హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
రామకృష్ణాపూర్ సిహెచ్‌పిలో ఫిట్ సెక్రటరీ హరి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ, వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, లాభాల వాటా, రక్షణ పరికరాలపై చర్చించారు. ఈ నెల 13న హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఇప్పటివరకు సింగరేణిలో ఏ హక్కు అయినా పోరాటం ద్వారానే సాధించుకున్నామని, ప్రస్తుతం కంపెనీ అవలంబిస్తున్న వింత ధోరణికి కారణం ప్రభుత్వం నుంచి రావాల్సిన 59 వేల కోట్ల రూపాయల బకాయిలేనని వారు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థ కాబట్టి, విద్యుత్ సౌధ వద్ద ధర్నా చేసి నిరసన తెలియజేయాలని, ప్రభుత్వం విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలన్నీ ఇప్పించి, పండుగ వాతావరణంలో కార్మికులకు లాభాల వాటా, బోనస్ చెల్లించాలని ఆయన కోరారు. ఈ మొత్తాన్ని చెల్లించడానికి సుమారు 100 కోట్లు అవసరమవుతాయని, సింగరేణి వద్ద డబ్బులు లేక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని అధికారులు వాపోయారు. ప్రస్తుతం సింగరేణి పరిస్థితి దయనీయంగా ఉందని, కనీసం కార్మికులకు అవసరమైన పనిముట్లు, డ్రిల్ రాడ్స్, డ్రిల్ బిట్స్, కీలలు వంటి చిన్న వస్తువులు కూడా కొనలేని పరిస్థితిలో ఉందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యం పెంచి, కంపెనీని దివాలా తీసే దిశగా నడిపించిందని, గత ప్రభుత్వ హయాంలో 26,000 కోట్లుగా ఉన్న అప్పు ఇప్పుడు సుమారు 60 వేల కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికుల పక్షాన నిలవడం లేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానం అవలంబిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కోల్గేట్ ప్రాంతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా గెలవలేదని, ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే, కోల్‌బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఓడించి కార్మికుల సత్తా చాటుతామని హెచ్చరించారు. మొన్న కార్మికుల పక్షాన సమ్మె నోటీసు ఇచ్చి 24 డిమాండ్లను సాధించుకున్నామని, సాధించిన డిమాండ్లను మంత్రికి, ఉపముఖ్యమంత్రికి తెలియజేసి అమలు చేస్తామని సింగరేణి యాజమాన్యం అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. గతంలో కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మధ్య జరిగే చర్చలు సర్క్యులర్ రూపంలో కార్యరూపం దాల్చేవి. ఇప్పుడు రాజకీయ జోక్యం పెరిగి, మంత్రుల అనుమతి, ఉపముఖ్యమంత్రి అనుమతి కావాలనడం విడ్డూరంగా తయారైంది. కొత్త బావులు లేక, కొత్త ఉద్యోగాలు లేక అందరూ అవస్థలు పడుతుంటే, ఏ ప్రభుత్వమూ కార్మికులను ఆలోచించకుండా సింగరేణి సొమ్మును వాడుకొని అప్పులపాలు చేస్తుందే తప్ప, సింగరేణి అభివృద్ధి కోసం ఏమీ చేయడం లేదని తెలిపారు. ఐఏఎస్ అధికారులు వస్తే కంపెనీ పరిస్థితులు మారుతాయని ఎదురుచూశారు. ఇప్పుడు మంత్రుల చుట్టూ తిరుగుతూ, వారి అనుమతి లేనిదే పనులు చేయడం లేదు. ఇది ఎక్కడ న్యాయమని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా సంస్థ, ప్రభుత్వం మారి శంకరయ్య కంపెనీని కాపాడే దిశగా ఆలోచించకపోతే, ఏఐటియుసి యూనియన్‌గా పోరాటాలకు సిద్ధమై కంపెనీని కాపాడుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్పి ఫిట్ కమిటీ సభ్యులు సీతారామా , డొక్కు శ్రీనివాస్, అబ్బాస్, జంగం శ్రీను, శ్రీధర్ , మండల శ్రీనివాస్, ఆవుల మల్లమ్మ, రజిత, వైష్ణవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.












