గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడంతో పాటు నీటి వనరుల పరిరక్షణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని భీమారం మండలం దాంపూర్ గ్రామంలో బాలవికాస నీటి శుద్ధికరణ పథకాన్ని ఆయన ప్రారంభించారు.
దాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బాలవికాస నీటి శుద్ధికరణ పథకాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన అనంతరం మంత్రి వివేకానంద మాట్లాడుతూ, ఈ పథకం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. 3 లక్షల 25 వేల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా 5 రూపాయలకు 20 లీటర్ల శుద్ధమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పారు. నీటిని పొదుపుగా వినియోగించడం, త్రాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడం, నీటి కాలుష్యాన్ని నివారించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. గ్రామాలలోని నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా సంక్షేమంలో భాగంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా దాంపూర్ గ్రామంలో 72 ఇండ్ల పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. గృహజ్యోతి పథకం క్రింద అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల విలువైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడం జరుగుతుందని, వ్యయపరిమితి దాటిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని సోమనపల్లిలో 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రజల సౌకర్యార్థం 100 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రజల కోసం పల్లె దవాఖానకు శంకుస్థాపన చేయడం జరిగిందని, 4 కోట్ల రూపాయలతో సీసీ రహదారుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బతుకమ్మ కొరకు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, బోర్లు ఏర్పాటు చేసి నీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివేకానంద పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












