ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక వాట్సాప్ నంబర్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ఆబ్కారీ, మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను నేరుగా వాట్సాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఇకపై ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా తమ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయవచ్చని తెలిపారు. హైదరాబాద్లోని జిల్లా ఇన్చార్జి మంత్రి పేషీలోనూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపడంతో పాటు, వాటి పరిష్కారంలో జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఇంచార్జ్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీ నంబర్: 8500689596, మంచిర్యాల కలెక్టరేట్ నంబర్: 9492123642. ప్రజలు పైన పేర్కొన్న నంబర్లకు కాల్ చేయవద్దని, కేవలం వాట్సాప్ నంబర్లకు తమ ఫిర్యాదులను మెసేజ్ రూపంలో పంపవచ్చని, ఫిర్యాదులో సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్య ఉన్న ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, సంబంధిత ఫోటోలను జత చేయాలని, తద్వారా సమస్యను గుర్తించి, సంబంధిత శాఖకు ఫిర్యాదును పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించడంతో పాటు, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడమే ఈ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.












