మంచేరియల్, 2026-08-26
చెట్లను అమ్మ, నాన్నలుగా భావించాలని, అవి మనిషికి రక్ష, మనిషి చెట్టుకు రక్షగా ఉండాలని ప్రకృతి మిత్ర తెలంగాణ పిలుపునిచ్చింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంచిర్యాలలో ప్రకృతిమిత్ర ఆధ్వర్యంలో వృక్ష రక్షబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెట్లకు సహజసిద్ధమైన రాఖీలు కట్టి, ఆలింగనం చేసుకున్నారు.
చెట్లను అమ్మ, నాన్నలు, తోబుట్టువులు, ఆత్మీయ నేస్తాలుగా గౌరవించాలని, మనిషికి చెట్టు రక్ష, చెట్టుకు మనిషి రక్షగా ఉండాలని ప్రకృతి మిత్ర తెలంగాణ పిలుపునిచ్చింది. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ప్రకృతిమిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మనిషికి చెట్టు రక్ష చెట్టుకు మనిషి రక్ష వృక్ష రక్షబంధన్ పేరిట బుధవారం మంచిర్యాల జన్మభూమి నగర్ లోని ప్రాచీన రాముని చెరువు కట్టపై వైవిధ్యభరితమైన కార్యక్రమాన్ని సంస్థ రాష్ట్ర వ్యవస్థాపకులు, తెలంగాణ ప్రభుత్వ వాల్టా పర్యావరణ చట్టం సెనేట్ సభ్యులు గుండేటి యోగేశ్వర్, ప్రకృతి మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సహజ సిద్ధ రాఖీలతో వృక్ష రక్షబంధన్
కార్యక్రమంలో భాగంగా, ముందుగా పరస్పరం సహజమైన పదార్థాలతో చేసిన రాఖీలు కట్టుకున్నారు. అనంతరం వివిధ ప్రకృతిమిత్ర పదార్థాలతో అట్ట, కాగితం, ధాన్యం గింజలు, ఆకులు, పూల రెక్కలు, డ్రై ఫ్రూట్స్ వ్యర్థాలు, దూదితో చేసిన పెద్ద సైజు రాఖీలను ఎంతో ప్రేమగా చెట్లకు కట్టి ఆలింగనం చేసుకున్నారు. చెట్లకు కృతజ్ఞతలు తెలిపారు. చెట్ల కింద సరదాగా గడిపారు.
చెట్లే ప్రగతికి మెట్లు.. నినాదాలు
అనంతరం చెట్ల చుట్టూ మానవహారంగా ఏర్పడి చెట్లే ప్రగతికి మెట్లు... చెట్లు నరికితే ఇక్కట్లు.. వేయకు చెట్టుకు వేటు... చేయకు భూమాతకు చేటు.. వనాలు ప్రకృతి ఇచ్చిన వరాలు... కాపాడుతాయవి అవి మనల్ని తరతరాలు.. పెరిగిన పచ్చదనం.. ఆరోగ్యానికి మూలధనం.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సేవ్.. సేవ్ ట్రీస్.. సేవ్ నేచర్ అంటూ నినదించారు.
చెట్ల సంరక్షణపై అధికారుల సూచనలు
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి రత్నాకర్ రావు, రెవెన్యూ అధికారి గడియారం శ్రీహరి, రాచకొండ చందన, రాధేశ్యాం మాట్లాడుతూ, మానవునితో పాటు సకల జీవనం ఆధారమైన చెట్లను ఆత్మీయ నేస్తాలుగా గౌరవించాలని సూచించారు. వివిధ కారణాలతో తొందరపాటు చర్యలతో నరకవద్దని, ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారి నిర్మాణంలో వివిధ శాఖల అధికారులతో ఆదర్శవంతమైన ప్రణాళికలు రూపొందించి చెట్లను కాపాడాలన్నారు. తప్పని పరిస్థితిలో ఒక చెట్టు నరికితే బదులుగా పది చెట్లు నాటి రక్షించాలన్నారు.
వనమహోత్సవాల ప్రాముఖ్యత
వనమహోత్సవాల లో చెట్లు నాటడం ఎంత ముఖ్యమో, ఏపుగా పెరిగిన ఏండ్ల నాటి చెట్లను, మహా వృక్షాలను కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యమని అన్నారు. చెట్టు మనిషికి రక్ష, మనిషి చెట్టుకు రక్షగా మారాలని పిలుపునిచ్చారు. ప్రజలు, యువత, మహిళలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్లాస్టిక్ బదులు సహజసిద్ధమైన పరస్పరం రాఖీలు కట్టుకొని, అందుబాటులో ఉన్న చెట్లకు రాఖీలు కట్టి రక్షించాలని తెలిపారు.











