మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు, విద్యారంగంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. గత రెండేళ్లలో నియోజకవర్గంలో రూ.65 కోట్లతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అల్పాహార కార్యక్రమాన్ని హరేరామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులందరికీ ఈ అల్పాహారం వర్తిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.65 కోట్లతో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడలు, నూతన తరగతి గదులు, మరుగుదొడ్లు, తదితర అభివృద్ధి పనులు పూర్తి చేసిందని తెలిపారు.
రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మిగిలి ఉన్న పనులను సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. విద్యారంగంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మరియు ఎంపీడీఓ, మండల విద్యాధికారి, స్థానిక సర్పంచ్, ఉపాధ్యాయులు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.












