హైదరాబాద్, 13 October
తెలంగాణలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. సంస్థ సాధించిన భారీ లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటాను ప్రకటించడంతో పాటు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. వారసత్వ ఉద్యోగాల సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రజా భవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన మీడియా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సింగరేణి పరివాహక శాసనసభ్యులు, సింగరేణి యాజమాన్యంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా ప్రకటించడం ద్వారా వారి శ్రమకు తగిన గుర్తింపు కల్పించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
మొత్తం రూ.1,754 కోట్ల లాభాల నేపథ్యంలో కార్మికులకు 34 శాతం వాటాను ప్రకటించారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు లాభాల్లో వాటా అందించడం వారి కష్టానికి తగిన గౌరవాన్ని అందించడమే కాకుండా, వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సైతం ప్రభుత్వం శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ప్రకటించడం ద్వారా వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. సంస్థ అభివృద్ధిలో రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కూడా కీలకమని గుర్తిస్తూ వారికి ప్రయోజనాలు కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.1,53,912 అందనుంది. దసరా బోనస్ రూ.1,10,250 చొప్పున ప్రకటించిన సంగతి తెలిసిందే.
సొంతింటి కల సాకారం
సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన సొంతింటి కలను సాకారం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులు, వారి కుటుంబాలు మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించేందుకు అవసరమైన సంక్షేమ చర్యలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించింది. కార్మికుల ఆర్థిక భద్రతతో పాటు నివాస సదుపాయాల కల్పన కూడా ప్రభుత్వ లక్ష్యాల్లో భాగమని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది.
15 రోజుల్లో ఉద్యోగాల సమస్య పరిష్కారం
సింగరేణిలో పెండింగ్లో ఉన్న వారసత్వ ఉద్యోగాల సమస్యపై ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. విజిలెన్స్ విచారణలు, పెండింగ్ కేసుల కారణంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కార్మికుల పిల్లలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, 15 రోజుల్లో ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని ప్రకటించడం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల్లో ఆశలు నింపింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.












