హైదరాబాద్, 4 September
స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముదిరాజ్ జీవితం, సేవలు నేటి యువతకు ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు.
*కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ సేవలు చిరస్మరణీయం: మంత్రి వాకిటి శ్రీహరి* *స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ మాజీ మేయర్, గొప్ప రచయిత, పాత్రికేయుడు, విద్యావేత్త, సామాజిక సేవకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి జయంతిని పురస్కరించుకుని మంత్రి వాకిటి శ్రీహరి ఘన నివాళులు అర్పించారు.* పేద రైతు కుటుంబంలో జన్మించిన కృష్ణస్వామి ముదిరాజ్ గారు పేదరికాన్ని అధిగమించి విద్యను అభ్యసించి, తన ప్రతిభ, పట్టుదల, సేవాభావంతో హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని మంత్రి పేర్కొన్నారు. పాత్రికేయుడిగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, రచయితగా హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి, సమాజాన్ని భవిష్యత్ తరాలకు అందించారని తెలిపారు. *‘పిక్టోరియల్ హైదరాబాద్’* వంటి విలువైన గ్రంథం ద్వారా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలోనూ కృష్ణస్వామి ముదిరాజ్ కీలక పాత్ర పోషించారని, మున్సిపల్ కౌన్సిలర్‌గా, రెండుసార్లు డిప్యూటీ మేయర్‌గా, హైదరాబాద్ మేయర్‌గా సేవలందించారని మంత్రి గుర్తుచేశారు. *మేయర్‌గా నగరానికి మాస్టర్‌ప్లాన్* రూపొందించడంలో ఆయన చూపిన దూరదృష్టి ప్రశంసనీయమన్నారు. *చేతి రిక్షాలను రద్దు చేసి* కార్మికుల గౌరవప్రదమైన జీవనానికి బాటలు వేసిన సంస్కరణవాదిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యంగా ముదిరాజ్ సమాజాన్ని సంఘటితం చేసి, సమాజ హక్కులు, అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడిగా కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ చరిత్రలో నిలిచిపోయారని మంత్రి అన్నారు. *మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ* వంటి జాతీయ నాయకులకు స్వాగతం పలికి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపారని, *భాగ్యరెడ్డివర్మ* వంటి సామాజిక ఉద్యమ నాయకులతో కలిసి సమసమాజం కోసం పోరాడారని తెలిపారు. కృష్ణస్వామి ముదిరాజ్ జీవితం నేటి యువతకు గొప్ప ఆదర్శమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. యువత విద్యను ఆయుధంగా చేసుకుని, సమాజం కోసం ఆలోచిస్తూ, హక్కుల కోసం పోరాడటంతో పాటు సామాజిక బాధ్యతలను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని మంత్రి పేర్కొన్నారు.









