మంచేరియల్, 2026-11-29
దశాబ్దాల జ్ఞాపకాలకు వేదికగా, స్నేహబంధాల కలయికగా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఉన్న పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో 19751995 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థుల 3వ ఆత్మీయ సమ్మేళనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల క్రితం ఒకే కళాశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులంతా దశాబ్దాల కాలం తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందోత్సాహాలను నింపింది. వయసు పెరిగినా, కాలం మారినా చెరిగిపోని స్నేహబంధాలు, మరచిపోలేని కళాశాల జ్ఞాపకాలు ప్రతి ఒక్కరిలో మధురానుభూతులను నింపాయి. విద్యార్థి దశలో కలిసి గడిపిన క్షణాలను, అప్పటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.
చదువుకున్న కళాశాలలపై మమకారం, తోటి స్నేహితులపై ఆప్యాయత, గడిచిన కాలపు మధుర జ్ఞాపకాలు.. ఇలా ఈ ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థుల మధ్య స్నేహం, అనుబంధం, ఆత్మీయతలను మరోసారి చిగురింపజేసింది.
విద్యనిచ్చిన కళాశాలను మరువకుండా, తమ అనుబంధాలను పదిలపరుచుకుంటూ, భావితరాలకు ఆదర్శంగా నిలవడమే పూర్వ విద్యార్థుల సమ్మేళనం యొక్క అసలైన స్ఫూర్తి. ఇలాంటి ఆత్మీయ కలయికలు కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారాన్ని మరింత పెంపొందించడంతో పాటు నేటి విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అనంతరం, చదువు నేర్పిన గురువులను శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







