కరీంనగర్, 2026-08-31
ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ కరీంనగర్ నగరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు కాలనీలోని పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకృతి మిత్ర సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ప్రకృతి పరిరక్షణ సందేశంతో ప్లే కార్డుల ప్రదర్శన, నినాదాలతో అవగాహన కల్పించారు. ప్రకృతి మిత్ర తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అవార్డు గ్రహీత కొత్తూరు ముకుందం ఆధ్వర్యంలో కరీంనగర్ నగర కేంద్రంలోని బ్యాంకు కాలనీలో ఉన్న ప్రకృతి రమణీయతను కనువిందు చేసే పార్కులో ప్రకృతి రక్షణ - మన బాధ్యత అనే అంశంపై స్థానిక ప్రజలకు, వాకర్స్‌కు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ పర్యావరణ వాల్టా అథారిటీ సెనేట్ పర్యావరణ వేత్త గుండేటి యోగేశ్వర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం ప్రకారం ప్రకృతి రక్షణ, జల వనరులు, అడవులు, వన్యప్రాణులను తప్పనిసరిగా సంరక్షించాలని, ప్రకృతిని కాపాడటానికి తోడ్పడాలని అన్నారు. ప్రకృతికి విరుద్ధమైన పనులు చేయకూడదని సూచించారు. ఇటీవల జరిగిన నేపాల్ ప్రకృతి విలయానికి మానవ తప్పిదమే కారణమని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
మన అలవాట్లు నేలకు, గాలికి, నీటికి హాని కలిగించని విధంగా ఉండాలని, ప్రతి పౌరుడు ప్రకృతి మిత్రులుగా మారాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని మానేసి, బజారుకు వెళ్లేటప్పుడు బట్ట సంచులు వాడాలని తెలిపారు. వివిధ సందర్భాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని, చిన్న చిన్న దూరాలకు సైకిల్ లేదా కాలినడకన వెళ్లాలని సూచించారు.
జిల్లా అధ్యక్షులు కొత్తూరు ముకుందం మాట్లాడుతూ, మన ఆరోగ్యం, రేపటి తరాల ఆరోగ్యం కోసం మనం ప్రకృతిని రక్షించాలన్నారు. యువత, విద్యార్థులు దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అనంతరం ప్రకృతి మిత్ర వ్యవస్థాపకుడు యోగేశ్వర్, పార్క్ సభ్యులకు రెండు సేంద్రియ ఎరువు బస్తాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రకృతి మిత్ర ముఖ్య బాధ్యులు, సభ్యులు హర్జీత్ సింగ్, రవికుమార్, శ్రీనివాస్, యు.వి రఘు రామ్ రెడ్డి, రామస్వామి, జి. రాజిరెడ్డి, సత్యనారాయణ, మనోహర్ రెడ్డి, అంజయ్య, కరుణాకర్, సత్యనారాయణ, ఆనందం, ఎన్. రాజిరెడ్డి, సామల కిరణ్, అశోక్, రవీందర్ రెడ్డి, రాజేష్, బ్యాంకు కాలనీ వాకర్స్ పాల్గొన్నారు.












