మంచేరియల్, July 27, 2026
ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించేందుకు, వరి సాగులో నష్టాలను నివారించేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా లబ్ధి పొందవచ్చని ఆయన తెలిపారు. రాయితీ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రైతులు వరి సాగు మినహా ప్రత్యామ్నాయ పంటల సాగు చేసి లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల రైతు వేదికను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు తక్కువ వర్షపాతం నమోదైందని, రాబోవు 3 నెలలలో కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. నీటి లభ్యతలో లోటు ఉండడంతో వరి సాగులో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, కావున రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి లబ్ధి పొందాలని సూచించారు.
భూగర్భ జలం తక్కువగా ఉందని, రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని, పప్పుధాన్యాలు, పత్తి, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి నీరు తక్కువ అవసరం ఉన్న పంటలు సాగు చేయాలని సూచించారు. అవసరమైన రాయితీ విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే, తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు వివరించాలని ఆదేశించారు. మండల, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి ఆదాయం వచ్చే పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భూసార పరీక్షలు నిర్వహించి కార్డులు అందించడం జరుగుతుందని, పంట సాగుకు అనుగుణంగా యూరియా అందించడం జరుగుతుందని తెలిపారు.
మండల కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు.
బెల్లంపల్లి మండలం గురజాల గ్రామంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు ప్రస్తుత ఎల్ నినో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంట రకాన్ని ఎంచుకోవాలని, తక్కువ నీటి అవసరం గల పంటలను సాగు చేసి లబ్ధి పొందాలని తెలిపారు. ఈ క్రమంలో రైతులకు రాయితీ విత్తనాలు, ఎరువులు అందించడం జరుగుతుందని, రైతులు తమ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు పొందాలని సూచించారు.
అనంతరం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని మండల తహసిల్దార్ కృష్ణతో కలిసి సందర్శించి, ప్రత్యేక సమగ్ర సవరణ, సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజల నుంచి సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీల తరపున నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్లు ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు అందించని వారి నుండి సేకరించి బూత్ స్థాయి అధికారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరి చూసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.











