వనపర్తి, 2026-08-12
ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం కారణంగా ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర క్రీడా, పాడిపరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం కారణంగా ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర క్రీడా, పాడిపరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా పాల్గొని, ఉమ్మడి జిల్లాల శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతులకు సాగునీరు అందించే అవకాశాలపై సమీక్షించారు.
ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై చర్చ
ఎల్ నినో కారణంగా కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున, ఉమ్మడి జిల్లా పరిధిలోని జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్, కే ఎల్ ఐ, బీమా తదితర ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టం, రాబోయే రోజుల్లో సాగు, తాగు అవసరాలకు సంబంధించి నీటి నిల్వలపై నీటిపారుదల శాఖ, వ్యవసాయ అధికారులతో మంత్రులు చర్చించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో రైతులకు సాగునీటి విడుదలకు సంబంధించిన సాధ్యసాధ్యాలపై కూడా చర్చించి పలు సూచనలు చేశారు.
ఎగువ ప్రాంతాలపై ఆధారపడిన నీటి లభ్యత
నీటిపారుదల శాఖ అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఎగువన ఉన్న ప్రాంతాల్లో వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడి నుంచి వరద రావడం వల్ల ప్రస్తుతానికి ప్రాజెక్టులు నింపుకోవడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరిగితేనే రైతులకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, అక్కడి నుంచి నీటి ప్రవాహం రాకపోతే సాగు కోసం నీరు విడుదల చేయడానికి అవకాశం ఉండదని వివరించారు. ప్రస్తుతానికి ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆపివేయడం జరిగిందని తెలిపారు.
అధికారుల జవాబుదారీతనంపై మంత్రి సూచన
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తున్నాయి, ఎంత వదులుతున్నామనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అధికారులు జవాబుదారీతనంతో ప్రజలకు అన్ని వివరాలను, వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు ఏమి ఇవ్వగలమో అదే చెప్పాలని వివరించారు.
ఆరుతడి పంటల ప్రోత్సాహం
రైతుల ప్రయోజనాల కోసం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారు ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రోత్సాహం కల్పించాలని మంత్రి సూచించారు. నీటికి సంబంధించి ప్రస్తుతం ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వరి పంటకు పోకుండా వారికి అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం వచ్చినప్పుడు రైతులకు తగినంత సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఇన్ఫ్లో తగ్గిపోతే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రైతులకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా రైతులకు ఆరుతడి పంటలు వేసుకునే విధంగా పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, అవగాహన కల్పించాలని ఆదేశించారు.












