జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులు, గోదాములకు తరలించిన ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పలు గోదాములు, కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు మంగళవారం జైపూర్ మండలం రామారావుపేటలోని వరలక్ష్మి, సుముఖ గోదాములను సందర్శించి, ధాన్యం దిగుమతి ప్రక్రియపై ఆరా తీశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని కేటాయించిన మిల్లులు, గోదాములకు తరలించడం జరుగుతోందని, ఈ దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
రోజుకు కనీసం 40 నుంచి 50 లారీల ధాన్యం దిగుమతి జరిగేలా చూడాలని, దీనికి అవసరమైన హమాలీలను సమకూర్చామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ నెలాఖరులోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తదనంతరం, భీమారం తహసిల్దార్‌తో కలిసి అర్కపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని, రైతులతో మాట్లాడి హమాలీల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు.
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.








