నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పంటను కాపాడుకునే ప్రయత్నంలో తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటనపై మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం సకాలంలో పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని ఆయన ఆరోపించారు.
లక్షెట్టిపేట మండలం గంపలపల్లి గ్రామానికి చెందిన తనుగుల నాగరాజు, తనుగుల అభిరామ్ అనే తండ్రీకొడుకులు అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంలో తమ పంటను కాపాడుకునే ప్రయత్నంలో మరణించారు. వీరి పార్థివ దేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత కుమార్ సందర్శించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పది రోజుల క్రితం కాంటకు వచ్చిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను నిర్లక్ష్యం చేయడం, వడ్లను సకాలంలో కొనుగోలు చేయకపోవడం వంటి ప్రభుత్వ విధానాలు ఇలాంటి విషాదాలకు దారితీస్తున్నాయని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, మంచిర్యాల ఎమ్మెల్యే, జిల్లా అధికారుల నిర్లక్ష్యపూరిత ప్రవర్తన వల్లే ఈ ఘటన జరిగిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు రైతుల పట్ల ఎందుకంత కోపమో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వ విధానాలను ఆయన ప్రశ్నించారు.
మరణించిన వారి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని, వారికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు.








