ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీకి మార్చాలనే డిమాండ్‌తో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజు ఆధ్వర్యంలో రాబోయే కాలంలో మిలీనియం మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలో న ఆయన, ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి ఉప సభాపతి డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజు మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముదిరాజుల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీకి మార్చుతూ జీవోలు జారీ అయినప్పటికీ, అనివార్య కారణాలు, కోర్టు కేసుల వల్ల అవి అమలు కాలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు బీసీ కమిషన్‌కు నివేదికలు సమర్పించినా, సుప్రీంకోర్టు కేసు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా, బీసీ కమిషన్ నివేదికలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మ్యానిఫెస్టోలో బీసీడీ నుంచి ఏ కేటగిరీకి మారుస్తామని, ముదిరాజుల హక్కులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఆ జీవో గానీ, ముదిరాజుల సమస్యలు గానీ పరిష్కరించలేదని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముదిరాజ్ సమస్యలపై తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘం, ఇతర సంఘాల నాయకులతో చర్చించి, అన్ని కుల సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి, రాబోయే కాలంలో మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని, ప్రతి గ్రామం నుంచి కుల బంధువులను సమీకరించి హక్కుల కోసం పోరాడుతామని తెలిపారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఉమ్మడి జిల్లాలను , జిల్లా అధ్యక్షులతో కలిసి కార్యాచరణ రూపొంది ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహా సభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య, రాష్ట్ర సీనియర్ కార్యదర్శి తండబోయిన శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి దెబ్బేట తిరుపతి, యువజన విభాగ అధ్యక్షుడు గరిక సుమన్, పట్టణ అధ్యక్షుడు భూతపల్లి రాజేశం, మంచిర్యాల పట్టణ, జిల్లా ముదిరాజ్ కుల బంధువులు పాల్గొన్నారు.











