మంచేరియల్, 2026-07-27
మంచిర్యాల జిల్లాలోని గిరిజన బాలుర వసతి గృహంలో వార్డెన్ స్కాలర్షిప్ అప్లికేషన్ల పేరుతో విద్యార్థుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన చర్యలు తీసుకొని వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని వారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల గిరిజన బాలుర వసతి గృహం (పోస్ట్ మెట్రిక్) లో వార్డెన్ విద్యార్థుల వద్ద నుంచి స్కాలర్షిప్ అప్లికేషన్ల పేరుతో అక్రమంగా రూ. 600 వసూలు చేశారని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన చర్యలు తీసుకొని వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని వారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ శ్రీ. కుమార్ దీపక్, ఐఏఎస్ గారికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, కొందరు అధికారులు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా సొంత నిర్ణయాలు తీసుకుంటూ, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. కష్టపడి తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంచి చదివిస్తున్న తల్లిదండ్రుల వద్ద నుంచి, స్కాలర్షిప్ అప్లికేషన్ల పేరుతో వార్డెన్ పూర్తి దురుద్దేశంతో డబ్బులు వసూలు చేయడం సరికాదని అన్నారు.
ఈ విషయంపై సంబంధిత జిల్లా శాఖ అధికారికి ఫిర్యాదు చేయగా, ATWO గారితో దర్యాప్తు చేయించి, అక్రమ వసూళ్ల విషయాన్ని కావాలని ఇద్దరు అమాయక విద్యార్థులపై నెట్టారని వారు ఆరోపించారు. ఈ విషయంపై లోతైన విచారణ జరిపించి, అక్రమ వసూళ్లకు పాల్పడిన హాస్టల్ వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ, నేషనల్ స్టూడెంట్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బచ్చలి అభిరామ్, అంబేద్కర్ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అవునూరి ప్రసాద్, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ అంకం సాగర్, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.












