మంచేరియల్, 2026-07-22
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని, బాలికల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించి, భద్రతా చర్యలు, నిర్మాణ పనులను పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, భూభారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారంపై కూడా ఆయన సమీక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని, బాలికల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సి.ఐ. రవీందర్ తో కలిసి సందర్శించిన ఆయన, భద్రతా చర్యలలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, భోజనశాల, వంటశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ క్రమంలో పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. ఇంటర్మీడియట్ బి.పి.సి. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యా బోధన నాణ్యత పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయులు విధుల పట్ల సమయపాలన పాటించాలని, వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, తహసిల్దార్ సంతోష్ కుమార్ తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను పరిశీలించారు. ప్రజల నుండి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియలో జాగ్రత్త వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా వివరాలు నమోదు చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రక్రియ వేగవంతానికి బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత సహకారం తీసుకోవాలని సూచించారు.
భూభారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. మందమర్రి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని తహసిల్దార్ సతీష్ కుమార్, బెల్లంపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణ, భూభారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.
సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి భూభారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.












