వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గణేష్ మండపాలను సీపీ సందర్శించి, పూజలు నిర్వహించారు. ఉత్సవాలను పోలీసుల అనుమతులు, నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, మండపాల వద్ద విద్యుత్ అలంకరణలు, వైరింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు. మండపాల వద్ద నిర్వాహకులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, భద్రత కోసం తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, పెట్రోల్ కార్లు, బ్లూకోట్స్ సిబ్బందితో 24 గంటలూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. ప్రతిరోజూ పోలీసు అధికారులు గణేష్ మండపాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లు, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇతర పరిస్థితులను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని సీపీ తెలిపారు. మండపాల నిర్వాహకులు కూడా పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, పోలీసుల సూచనలను పాటిస్తే గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవచ్చని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మండపాల వద్ద ఏవైనా అనుకోని సంఘటనలు లేదా అనుమానాస్పద పరిస్థితులు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్, ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు తదితర పోలీసు అధికారులు ఉన్నారు.












