రామగుండం, 15 September
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్, ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణ, గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్, కమిషనరేట్ కార్యాలయంలో ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీలు, అడిషనల్ డీసీపీ (అడ్మిన్), ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా పోలీస్ స్టేషన్, డివిజన్, జోన్ వారీగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాల్లో కేసుల ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో నమోదైన తీవ్రమైన నేరాలు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, అదృశ్యమైన వ్యక్తుల కేసులు, గంజాయి కేసులు, రోడ్డు ప్రమాద కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పాత కేసుల దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ వారీగా ఆన్లైన్లో నమోదైన పెండింగ్ అంశాలను సమీక్షించారు. నేరాల నియంత్రణకు అధికారులు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కూడా చర్చించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు. జిల్లాలు, రాష్ట్రాల్లో చోటుచేసుకునే పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నచిన్న విషయాలు కూడా పోలీసులకు తెలిసే విధంగా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. తీవ్రమైన నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలు పెండింగ్‌లో లేకుండా చూడాలని ఆదేశించారు. తీవ్రమైన నేరాలు, యూఐ కేసులపై డీసీపీలు ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, వారానికోసారి సమీక్షించాలని సూచించారు. ఆస్తి నేరాలు, గొలుసు దొంగతనాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, సీసీఎస్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో కనిపించే విధంగా పోలీసింగ్, విస్తృతంగా గస్తీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రజలతో సంబంధాలను మరింత పెంచాలని ఆదేశించారు.
మహిళలు, బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను నిర్దేశిత కాలపరిమితిలోగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. షీ టీమ్స్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని, వినాయక మండపాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకతాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తుతో పాటు కోర్టు కేసుల పరిష్కారంపై కూడా అధికారులు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసి, నేర నిర్ధారణ శాతాన్ని పెంచేందుకు డీసీపీలు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కోర్టు కేసుల పురోగతిని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లను (ఎన్బీడబ్ల్యూ) ప్రత్యేక దృష్టితో అమలు చేయాలని ఆదేశించారు. గంజాయి అక్రమ సరఫరా, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అదృశ్యమైన వ్యక్తుల కేసులను డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్థిక నేరాల్లో నేరపూరితంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి, చట్టప్రకారం స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. సైబర్ నేర విభాగం పనితీరును పోలీస్ కమిషనర్ అభినందించారు. చట్టప్రకారం కేసు నమోదు చేయాల్సిన ప్రతి సందర్భంలో తప్పనిసరిగా కేసు నమోదు చేయాలని సూచించారు. డీజీపీ, సీసీసీ పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లను కూడా త్వరితగతిన విచారించాలని, ఫిర్యాదు నిజమని తేలితే కేసు నమోదు చేయాలని, తప్పుడు ఫిర్యాదుల విషయంలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.












