గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందించాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మంగళవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఇతర అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజనుల కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. గిరిజన ప్రజలకు మౌలిక వసతులు, విద్య, వైద్యం, విద్యుత్, సాగునీరు, త్రాగునీరు, ఉపాధి, భద్రత తదితర సదుపాయాలు సమర్థవంతంగా అందించాలని సూచించారు.
అటవీ హక్కులు, అభివృద్ధి
అటవీ శాఖ పరిధిలో గిరిజనుల హక్కులు, అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు అందుతున్న సౌకర్యాలు, అటవీ ఆధారిత జీవనోపాధి, గిరిజన ప్రాంతాలలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించి, గిరిజనుల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా, వారి హక్కులను పరిరక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
శాంతిభద్రతలు, భద్రత
గిరిజన ప్రాంతాలలో శాంతిభద్రతల పరిస్థితి, గిరిజన ప్రజల భద్రత, వారి నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం, పోలీస్ స్టేషన్లలో గిరిజనుల సమస్యలపై స్పందన, మహిళలు, బాలల రక్షణ, గిరిజనుల హక్కులకు సంబంధించిన అంశాలపై పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీస్ శాఖ దృష్టికి తీసుకువచ్చేలా అనుకూల వాతావరణం కల్పించాలని, వారి ఫిర్యాదులను సత్వరమే స్వీకరించి చట్టపరంగా పరిష్కరించాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గిరిజనులపై దాడులు, వారి హక్కులకు భంగం కలిగించే ఘటనల విషయంలో పోలీస్ శాఖ తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
విద్యుత్, సాగునీరు, వైద్యం
గిరిజన ఆవాసాలు, తండాలు, గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా పరిస్థితి, కొత్త విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యుత్ అంతరాయాల సమస్యలు తదితర అంశాలను సమీక్షించి, సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. గిరిజన రైతులకు సాగునీటి సౌకర్యం, సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, నీటి వనరుల వినియోగం తదితర అంశాలపై సమీక్షించి, గిరిజన రైతులకు సాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వ్యవసాయ ఆధారిత జీవనోపాధిని బలోపేతం చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య సేవలు, వైద్య సిబ్బంది అందుబాటు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, టీకాలు, పోషకాహారం, అత్యవసర వైద్య సేవలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకొని, దూర ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగుపరచాలని, వసతి సౌకర్యాలు కల్పించాలని, ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించాలని, నైపుణ్యాభివృద్ధి ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అర్హులైన గిరిజన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి కారణంతోనూ దూరం కాకుండా, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.



