మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ లో వైద్య మోహన్ (40) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో భార్య, కూతురే కారణమని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ లో వైద్య మోహన్ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. మృతుడి తండ్రి వైద్య చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తన కుమారుడు మోహన్‌కు, కోడలు జమునకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. అయితే, వారి వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా ఇరువురూ దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. పెద్దల సమక్షంలో పంచాయతీ అనంతరం 3 నెలల క్రితం ఇరువురూ కలిసి అశోక్ రోడ్లో నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరగగా, ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో కోడలు జమున, మనుమరాలు వైద్య సింధు కలిసి మోహన్‌ను దారుణంగా హత్య చేసినట్లు ఫిర్యాదులో ఉంది. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రమోదరావు తెలిపారు. కుటుంబ కలహాలు హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.












