ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనం సముదాయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పథకం అమలు, నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనం సముదాయంలో కలెక్టర్ సమావేశ మందిరంలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఎ.సి.పి.లు ప్రకాష్, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, ఆహార భద్రత శాఖ అధికారి వాసురామ్, ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి రోజు కనీసం 5 ప్రభుత్వ పాఠశాలలను అధికారులు తనిఖీ చేసి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల పరిసరాలను పరిశీలించాలని తెలిపారు. జిల్లాలోని హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలు, వాటర్ ప్లాంట్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, ఆహార పదార్థాల నాణ్యత, తయారీ ప్రదేశాల పరిశుభ్రత, త్రాగునీటి నాణ్యత, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. హోటళ్లు, ఇతర ఆహార సంస్థల తనిఖీలను పోలీస్ శాఖ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సమన్వయంతో నిర్వహించాలని, పరిశుభ్రత ప్రమాణాలు పాటించని హోటళ్లు, ఆహార సంస్థలకు నోటీసులు జారీ చేసి, 15 రోజులలోగా వివరణ సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఆహార నాణ్యత, పరిశుభ్రతకు సంబంధించి ప్రజల నుంచి తరచుగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు ఆహార నాణ్యత, హోటళ్లు, త్రాగునీటి ప్లాంట్లు తదితర అంశాలపై ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఫుడ్ సేఫ్టీ అధికారి ఫోన్ నంబర్, ఫిర్యాదు లింక్‌ను మంచిర్యాల జిల్లా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు 7981904028 నంబర్‌ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో స్వీకరించి, సంబంధిత అధికారులు వెంటనే స్పందించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.












