హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న అమృతరాణి అనే విద్యార్థిని పురుగుల మందు తాగించి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు తెలిపారు.
పెద్దపల్లి నియోజకవర్గం మండలం రేగడి మద్దికుంట గ్రామంలో అక్షితరాణి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబార్ ఝా కిషోర్ తో కలిసి ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.4,12,500 లక్షల పరిహార పత్రాన్ని అందజేశారు.
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న అమృతరాణి, సింగరేణిలో ఎంట్రన్షిప్ చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఇద్దరు వ్యక్తులు ఆమెకు పురుగుల మందు తాగించి దారుణంగా హత్య చేశారని, ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థిని హత్యకు కారణమైన వారిని పోలీసులు 24 గంటల్లోపు అరెస్టు చేశారని మంత్రి తెలిపారు. దోషులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా పోలీసులు చార్జిషీటు దాఖలు చేయాలని రామగుండం సీపీని మంత్రి ఆదేశించారు.
భవిష్యత్తులో దళితులపై, పేదలపై ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై 2013 తర్వాత ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హై లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించారని మంత్రి గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బాధితులకు రూ. 4.12 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో రూ. 4.12 లక్షలు అందజేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రకటించినందుకు ఎమ్మెల్యే విజయరమణారావుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థిని అమృతరాణి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగం అందిస్తామని హామీ ఇచ్చారు. జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు తానే భరిస్తానని తెలిపారు.
రాష్ట్రంలో మహిళలపై వేధింపులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సింగరేణిలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, విచారణ జరిపించి బాధ్యులైన సింగరేణి అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు.












