జైపూర్ మండలం టేకుమట్ల ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నాయకులపై, ముఖ్యంగా బాల్క సుమన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని రైతులకు హామీ ఇచ్చారు. ఈసారి పంట దిగుబడి పెరిగిందని, లక్ష 70 వేల టన్నుల కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గతంలో లక్ష పది వేల టన్నుల కొనుగోళ్లు జరిగాయని, పెద్దపల్లిలో మూడు గోడౌన్లను కేటాయించామని పేర్కొన్నారు.
హమాలీ కొరత, లారీలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యల వల్ల కొనుగోళ్ల ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగిందని, దీనిపై సింగరేణి సంస్థను సంప్రదించినట్లు మంత్రి తెలిపారు. కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నప్పటికీ, బీఆర్ఎస్ నాయకులు కావాలనే ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బాల్క సుమన్ ప్రజలచే తిరస్కరించబడ్డారని, ఆ నిరాశతోనే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని మంత్రి అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో లారీల సమస్య తీవ్రంగా ఉండేదని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గత ఎన్నికల్లో బాల్క సుమన్ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు తెలుసునని, ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిని బీఆర్ఎస్ నాశనం చేసిందని, లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని, సింగరేణి భవనాన్ని తగలబెట్టాలా అని ప్రశ్నించారు.












