విశాఖపట్నంలో ప్రతిపాదిత గూగుల్ AI డేటా సెంటర్ ప్రాజెక్టుపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం సరికాదని ఆయన విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో భూమి పూజలు, భారీ ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక ప్రజలకు, ముఖ్యంగా దళితులకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా కలుగుతుందని ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు. కోట్ల విలువైన భూములను అతి తక్కువ ధరకు కంపెనీలకు అప్పగించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ అంటే దేశీయ యువతకు, చిన్న పరిశ్రమలకు అవకాశాలు కల్పించడమేనని, కానీ విదేశీ లేదా పెద్ద కార్పొరేట్ కంపెనీలకే ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వాలు వ్యవహరించడం ప్రజల ఆత్మగౌరవానికి విరుద్ధమని ఎంపీ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువత, కార్మికులు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, వారి సమస్యలను విస్మరించి వేల ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు కేటాయించడం బాధాకరమని ఆయన అన్నారు.
గూగుల్ AI డేటా సెంటర్ల వల్ల భవిష్యత్తులో నీటి కొరత, కాలుష్య సమస్యలు, విద్యుత్ వినియోగ భారం పెరిగే ప్రమాదం ఉందని ఎంపీ వంశీకృష్ణ హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తిన ఉదాహరణలు ఉన్నాయని, విశాఖపట్నంలో కూడా అదే పరిస్థితి రాకుండా ముందుగానే సమగ్ర సమీక్ష చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అభివృద్ధి పేరుతో ప్రజల భూములు, హక్కులు కోల్పోయే పరిస్థితి రావొద్దని, స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, దళితులు, పేదలు, రైతుల హక్కులను కాపాడే విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. ప్రజా హక్కుల పరిరక్షణ కోసం తాను నిరంతరం పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.








