రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ నాయకుల పట్ల అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణి కొనసాగుతోందని బీసీ సమాజ్ తీవ్రంగా ఆరోపించింది. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న బీసీ నాయకుడు, మంత్రి వాకిటి శ్రీహరిపై సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రదర్శించిన అహంకారపూరిత వైఖరిని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజ్ హెచ్చరికలు జారీ చేసింది.
బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ, పార్టీలోనే బీసీ నాయకులకు అవమానాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేరుకు బీసీ మంత్రులు ఉన్నా, ప్రభుత్వ వ్యవస్థలో ఆధిపత్య కులాల ప్రాబల్యమే కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది నిన్నటి సంఘటనతో మరోసారి స్పష్టమైందని ఆయన అన్నారు.
దేశంలో, రాష్ట్రంలో 50 శాతానికి పైగా జనాభా కలిగిన బీసీ వర్గాలకు ఇప్పటికీ సరైన గౌరవం, రాజకీయ ప్రాధాన్యం దక్కకపోవడం బాధాకరమని నరెడ్ల శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు వెంటనే స్పందించి, బీసీ నాయకుడిని అవమానించిన మంత్రిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
బీసీలను అంతర్గతంగా అవమానిస్తూ, అణగదొక్కే రాజకీయ ధోరణులను ఇకపై సహించబోమని బీసీ సమాజ్ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలను ఏకం చేసి, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఉద్యమాత్మక కార్యాచరణ చేపడతామని, అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తగిన గుణపాఠం చెబుతామని నరెడ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు.












