మంచేరియల్, 2026-07-30
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటి గోడ కూలిన ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటి గోడ కూలిన ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, ఆర్.ఎం.ఓ. లు భీష్మ, శ్రీధర్, కోటపల్లి మండల తహసిల్దార్ రాఘవేంద్ర లతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేకానంద మాట్లాడుతూ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోటపల్లి మండలం ఆలుగాం గ్రామానికి చెందిన ఆత్రం మాంతయ్య ఇంటి గోడ కూలిపోవడంతో, ఇంట్లో ఉన్న ఆత్రం లక్ష్మి తలకు, ఆత్రం అనిల్ చేతికి గాయాలయ్యాయని తెలిపారు. వీరికి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు, పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.
ప్రస్తుత వర్ష పరిస్థితులలో ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు, వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్లకు తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు జారీ చేసినట్లు, భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సంరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.










