మంచేరియల్, 2026-07-29
నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ అప్రమత్తమయ్యారు. నగరంలోని ఉప్పొంగుతున్న నాళాలు, లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, యంత్రాంగానికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, మేయర్ శ్రీ దర్ని మధుకర్ వివిధ డివిజన్లలో పర్యటించారు. ఉప్పొంగుతున్న నాళాలు, లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, సత్వర చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
39వ డివిజన్ బృందావన్ కాలనీ ప్లే ఓవర్ ప్రక్కన వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నాళాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, అడ్డుగా ఉన్న పైపులను JCB సాయంతో దగ్గరుండి తొలగించి, వెంటనే నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. అధిక వర్షపాత దృష్ట్యా అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వర్షాల ప్రభావంతో అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని మేయర్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రథమ ప్రాధాన్యమని పేర్కొంటూ, అవసరమైన అన్ని ముందస్తు మరియు అత్యవసర చర్యలు వేగవంతంగా చేపట్టాలని సూచించారు.
అలాగే ప్రజలు అవసరం లేని సమయంలో ఉప్పొంగుతున్న నాళాలు, వాగులు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











