మంచేరియల్, July 2, 2026
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో భూ సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం భీమారం మండలం మద్దికల్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, రికార్డుల ఆధారంగా పరిష్కారం చూపుతామన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో భూ సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని భీమారం మండలం మద్దికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల తహసిల్దార్ సదానందం తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డులను చూసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మొదటగా గ్రామంలోని భూములకు హద్దులు నిర్ధారించి, గ్రామానికి సంబంధించిన భూమిపై స్పష్టత తీసుకురావడంతో పాటు ప్రభుత్వ భూములను కూడా నిర్ధారిస్తామని తెలిపారు. పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా కలిగి ఉండకపోవడం వంటి అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భూ సర్వేను సమగ్రంగా నిర్వహించి మ్యాపింగ్ చేస్తామని, ఈ క్రమంలో తలెత్తే భూ సమస్యలకు న్యాయపరమైన చర్యలు సులభతరం అవుతాయన్నారు. మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయడం ద్వారా న్యాయపరంగా రావలసిన భూమి అందుతుందని తెలిపారు. సర్వేయర్లు, ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి, తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్యతో పాటు, మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి, విద్యార్థులను పాఠశాలలకు పంపించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకంలో కొనసాగుతున్న నీటి ట్యాంక్, పైపు లైన్ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ప్రజలకు నిరంతరంగా త్రాగునీటిని అందించేందుకు చేపట్టిన ఈ పనులను త్వరగా పూర్తి చేసేలా గుత్తేదారుతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












