మంచేరియల్, జూలై 2, 2026
జిల్లాలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం చెన్నూర్ లోని 191వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, బూత్ స్థాయి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఎం.ఎల్.ఎస్. పాయింట్ గోదామును తనిఖీ చేశారు.
జిల్లాలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలోని 191వ పోలింగ్ కేంద్రాన్ని మండల తహసిల్దార్ మల్లికార్జున్ తో కలిసి సందర్శించి, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ స్థాయి అధికారికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, పంపిణీ చేసిన ఫారాలను వివరాలు నమోదు చేసిన తర్వాత సంబంధిత ఓటరు నుండి తిరిగి తీసుకొని బి.ఎల్.ఓ. యాప్ లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలలో వివరాలు నమోదు చేయడంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని, బూత్ స్థాయి ఏజెంట్ల సహకారంతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
అనంతరం చెన్నూర్ లోని ఎం.ఎల్.ఎస్. పాయింట్ గోదామును పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి తనిఖీ చేసి, ధాన్యం లోడింగ్, పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. గోదాము నుండి ధాన్యం లోడింగ్, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, వీలైనంత త్వరగా డీలర్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం తరలింపులో జాప్యం కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పర్యవేక్షించాలని స్టేజ్ 2 గుత్తేదారు, సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












