మంచేరియల్, జూలై 27, 2026
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు తో కలిసి ఆయన అర్జీదారుల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన ఆముర్ల కృష్ణ తనకు ఆర్థిక స్తోమత లేదని, తన పిల్లలకు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలలో సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కన్నెపల్లి మండల కేంద్రానికి చెందిన గాండ్ల మల్లేష్, గాండ్ల తిరుపతి తమ తాతల నుండి వస్తున్న భూమిని కొందరు అక్రమంగా పట్టా చేయించుకున్నారని, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి దొంగ పట్టాను రద్దుచేసి తమ పేరిట పట్టా చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సురిమిల్ల పెద్దయ్య తన పేరిట గ్రామ శివారులో ఉన్న భూమి విస్తీర్ణం ఆన్ లైన్ లో తక్కువగా నమోదు అయిందని, వివరాలను పరిశీలించి సవరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
మందమర్రి మండల కేంద్రానికి చెందిన కె.కృష్ణవేణి తాను గురుకుల పాఠశాలలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నానని, ఈ సంవత్సరం ఆటో రెన్యువల్ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. భీమిని మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముత్తినేని రాజేశం ప్రమాదంలో గాయపడి వెన్నుపూస దెబ్బతిందని, తనకు బండి ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన బానోత్ రాజు తాను దివ్యాంగుడిని అని, తనకు తెలియకుండా తన భూమిని నకిలీ పత్రాల ఆధారంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని, ఈ విషయమై విచారించి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన రవికుమార్ తాను, తన భార్య దివ్యాంగులమని, నిరుపేద అయిన తమకు రెండు పడక గదుల ఇల్లు ఇప్పించి అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన దుమల్ల అరుణ్ కుమార్ తన తండ్రి గ్రామ రెవెన్యూ సహాయకుడిగా విధులు నిర్వహిస్తూ మరణించారని, కారుణ్య నియామకం క్రింద తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











