Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 27
సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ (CITU) ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 69వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సిర్పూర్ పేపర్ మిల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పరిశ్రమ ప్రధాన గేటు వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 69వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ (CITU) ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్ నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ది సిర్పూర్ పేపర్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను 2018 ఆగస్టు నెలలో జేకే పేపర్ లిమిటెడ్ యాజమాన్యం టేకోవర్ చేసిందన్నారు. సంస్థ పునఃప్రారంభమై తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంతో వేతన ఒప్పందాలు, సేవా నిబంధనలు మరియు ఇతర కార్మిక సమస్యలు పరిష్కారం కాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పరిశ్రమ ప్రధాన గేటు వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. పేపర్ మిల్ యాజమాన్యం వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి, ఎన్నికల్లో విజయం సాధించిన గుర్తింపు సంఘంతోనే వేతన ఒప్పందం (అగ్రిమెంట్) చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న హైకోర్టు కేసును పేపర్ మిల్ యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మికులు ఇప్పటివరకు శాంతియుతంగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.
యాజమాన్యం వెంటనే స్పందించి కేసును ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 3న రిలే నిరాహార దీక్షలు 75వ రోజుకు చేరుతున్న సందర్భంగా 75 మంది కార్మికులతో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.
అలాగే ఆగస్టు 10న జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ నిర్వహించే దేశవ్యాప్త "జైల్ భరో" కార్యక్రమంలో భాగంగా సిర్పూర్ పేపర్ మిల్ గేటు ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. సిర్పూర్ పేపర్ మిల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు.
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, వాణిజ్య, వ్యాపార సంఘాలతో కలిసి విస్తృత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రాములు, కో-కన్వీనర్ సి. వెంకటేష్, ఏ.కే. సింగ్, వివిధ కార్మిక సంఘాల నాయకులు షబ్బీర్, కుషణ్ రాజన్న, పి. గణపతి, డి. కనకాచారి, రామిశెట్టి రాజన్న, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.










