తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం జూన్ 21న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరగనుంది. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు.
శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఉద్యమకారులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ సమ్మేళనం లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన కే.కె. కమిటీని తాము స్వాగతిస్తున్నామని, ఉద్యమకారులకు 250 గజాల నివాస స్థలాన్ని అందించేందుకు ప్రభుత్వం అడుగులు వేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
అయితే, ఈ కమిటీ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో ఉద్యమకారుల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు సేకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సుందిళ్ల సతీష్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణతో పాటు, సమ్మేళనానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.











