త్యాగం, కరుణ, శాంతికి ప్రతీకగా నిలిచే బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రార్థనల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈద్గాల వద్ద ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అమలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, బక్రీద్ పండుగ త్యాగానికి, ప్రేమకు, మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలంతా పరస్పరం మతాలను గౌరవించుకుంటూ, సోదరభావంతో పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. ఈద్గాలు, మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా డయల్-100ను సంప్రదించాలని సూచించారు.











