జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, తాండూర్ మండలంలోని చౌటుపల్లిలో ప్రధానమంత్రి అజయ్ పథకం క్రింద జరుగుతున్న పనులను పరిశీలించి, వాటిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, అదనపు కలెక్టర్ పారిశుద్ధ్య పనులు, నర్సరీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను సమీక్షించారు. ప్రధానమంత్రి అజయ్ పథకం కింద ప్రతిపాదించిన సి.సి. మురుగు కాలువలు, కల్వర్టులు, త్రాగునీటి పైప్ లైన్ల కోసం గుర్తించిన స్థలాలను కూడా ఆయన పరిశీలించారు.
గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, వడ్ల కొనుగోలు, త్రాగునీటి సరఫరా, నూతన పింఛన్లు, రేషన్ బియ్యం పంపిణీ, మురుగు కాలువల పరిస్థితులపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య తెలిపారు. ఈ పర్యటనలో డివిజనల్ పంచాయతీ అధికారి, బెల్లంపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి, తాండూర్ మండల పంచాయతీ అధికారి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.











