మంచేరియల్, 2026-07-19
మంచిర్యాల జిల్లాలో పాల కేంద్రాల పేరుతో కొందరు వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డైరీ ఫామ్ నుంచి పాలు వస్తున్నాయని నమ్మించి, కల్తీ పాలు, పెరుగు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని అంధకారంలోకి నెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ వ్యవహారం యథేచ్ఛగా కొనసాగుతోందని విమర్శలు వస్తున్నాయి.
మంచిర్యాల జిల్లాలో గత కొంతకాలంగా పాల కేంద్రాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. ఈ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
డైరీ ఫాములు లేకుండానే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి "మా పాలు రోజూ డైరీ ఫామ్ నుంచి వస్తున్నాయి" అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
అంతేకాకుండా పాల కవర్ ప్యాకెట్లలో పెరుగు ప్యాక్ చేసి అమ్ముతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. నాణ్యత, పరిశుభ్రతకు సంబంధించి ఎలాంటి పరీక్షలు లేకుండానే పాలు, పెరుగు విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో పాల వ్యాపారులు ఇష్టారాజ్యంగా రాజ్యమేలుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
కల్తీ పాలు, కల్తీ పెరుగు వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు అన్ని పాల కేంద్రాలను తనిఖీ చేసి, అనుమతి లేని కేంద్రాలను మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












