మంచేరియల్, 2026-07-04
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నిజాం పాలనలో ప్రజల విముక్తి కోసం కొమురయ్య చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కొనియాడారు.
నిజాం నిరంకుశ పాలనలో ప్రజల సంక్షేమం, భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ సాయుధ ఉద్యమంలో దొడ్డి కొమురయ్య అలుపెరుగని పోరాటం చేశారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య వర్ధంతి ఉత్సవాలకు వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, వెనుకబడిన తరగతుల కులాల సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో అణిచివేతకు గురవుతున్న ప్రజల ఆత్మగౌరవం, భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమంలో దొడ్డి కొమురయ్య వీరోచిత పోరాటం చేశారని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై చైతన్యపరిచి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం యువతకు మార్గదర్శకమని తెలిపారు.
దేశ స్వాతంత్రం, ప్రజల సంక్షేమం కోసం విరోచితంగా పోరాడి, ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












