మంచేరియల్, 04-07-2026
సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 01-07-2026 నుండి 01-08-2026 వరకు అమల్లో ఉంటాయి. అలాగే, డీజే సౌండ్స్, డ్రోన్ల వాడకంపై కూడా నిషేధాజ్ఞలను పొడిగించారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం మత్తులో వీధులు, రహదారులపై అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్య పదజాలంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వల్ల సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ నిషేధాజ్ఞలు 01-07-2026 నుండి 01-08-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి వాటి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో డీజే సౌండ్స్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి అంతరాయం కలగకుండా, శబ్ద కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో అధిక శబ్దంతో కూడిన డీజే సౌండ్స్ వినియోగంపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. అయితే, ఏదైనా కార్యక్రమం నిర్వహణకు మైక్ సెట్ అవసరమైతే సంబంధిత డివిజన్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు. మైక్ సెట్ వినియోగానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అనుమతి లేకుండా డ్రోన్లను వినియోగించడం కూడా నిషేధితమని, డ్రోన్లను వినియోగించాలనుకునేవారు సంబంధిత పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు.
డీజే సౌండ్స్, డ్రోన్లకు సంబంధించిన ఈ నిషేధాజ్ఞలు కూడా 01-07-2026 నుండి 01-08-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి వాటి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో రామగుండం పోలీస్ కమిషనరేట్ చట్టం–2016లోని సెక్షన్ 7(1), సెక్షన్ 22(1)(a) నుండి (f), సెక్షన్ 22(2)(a), (b), సెక్షన్ 22(3), సిటీ పోలీస్ చట్టం–1348 ఫసలీ (నం. IX)లోని సెక్షన్ 30, పోలీస్ చట్టం–1861 ప్రకారం 01-07-2026 ఉదయం 6.00 గంటల నుండి 01-08-2026 ఉదయం 6.00 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కాలంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటే సంబంధిత పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు. అలాగే బంద్‌ల పేరుతో వ్యాపార సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించడం, ఒత్తిడి చేయడం లేదా బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా విజ్ఞప్తి చేశారు.











