ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఆయన అదనపు కలెక్టర్లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
మండలం నందులపల్లి గ్రామానికి చెందిన ఇందూరి నాగయ్య, తన కుమారుడు తన భూమిలోకి రాకుండా అడ్డుకొని భయపెడుతున్నాడని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 5వ వార్డుకు చెందిన గుర్రం అంకమ్మ, తాను చుట్టూ రేకులతో తాత్కాలిక ఇల్లు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నానని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కల్లు సునీత, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరై బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, బిల్లు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మండలం గన్ పూర్ గ్రామానికి చెందిన కొట్టే అశోక్, తన తండ్రి పేరిట గల భూమి నిషేధిత జాబితాలో ఉందని, ఇట్టి భూమిని రికార్డుల ప్రకారం సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జన్నారం మండలం కవ్వాల్ గ్రామ సర్పంచ్, తమ గ్రామపంచాయతీలో స్థానికంగా లేని కొంతమంది వ్యక్తులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై తగు విచారణ జరిపి ఓటరు జాబితా ప్రక్రియ సక్రమంగా చేపట్టాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండల కేంద్రానికి చెందిన జి. శైలజ, తాను కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఫిజిక్స్ గెస్ట్ టీచర్ గా విధులు నిర్వహించానని, తనకు రావలసిన వేతనం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అర్జీదారులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అంతకుముందు జిల్లాలోని మందమర్రి మున్సిపల్ పరిధిలోని శ్రీపతి నగర్ లో అక్షర యూత్ గణేష్ మండలి వారు ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడిని, మున్సిపల్ కమిషనర్ రాజలింగు తో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని పూజించడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో అన్ని గణేష్ మండళ్ల నిర్వాహకులు మట్టి వినాయకుని పూజించాలని ఆయన సూచించారు. వినాయక విగ్రహాల తయారీకి వినియోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగుల ద్వారా వాయు, జల, నేల కాలుష్యం జరుగుతుందని, ఈ కాలుష్యాన్ని నియంత్రించే మట్టి వినాయకులను పూజించాలని తెలిపారు.











