డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమాజ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారని కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ముఖ్యంగా మహిళల అభివృద్ధికి అంబేద్కర్ ప్రత్యేక అవకాశాలు కల్పించేలా ఆలోచనలు, చర్యలు చేపట్టారని, మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా రిజర్వేషన్లకు మార్గం సుగమం చేశారని ఆయన తెలిపారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో మహిళా బిల్లుకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. తన సతీమణి కూడా మహిళల సాధికారత, సామాజిక చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా విద్యా, సామాజిక రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ పేరుతో నిర్వహిస్తున్న విద్యాసంస్థల ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్య అందుతోందని పేర్కొన్నారు.
నాగోల్ బండ్లగూడలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) కార్యాలయంలో జిఎస్ఐ సదర్న్ రీజియన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి, జిఎస్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని, తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడారని, అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ఆయన ప్రజలకు విశేష సేవలు అందించారని తెలిపారు. ప్రజలకు సహాయం చేయడం, సామాజిక బాధ్యతతో ముందుకు సాగడం వంటి విలువలను తన తండ్రి నుంచే నేర్చుకున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సేవలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టడంలో అధికారులు మరింత లోతుగా అధ్యయనం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిఎస్ఐ సేవల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఐదు లక్షలతో ప్రారంభమైన వ్యాపారాలు నేడు కోట్ల రూపాయల వ్యాపారాలుగా ఎదిగి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని, అన్ని రంగాల్లో పురోగతికి సహకరించాలని పిలుపునిచ్చారు.












