తెలంగాణ యువత తమ భవిష్యత్తుతో రాజకీయాలు చేసే వారిని సహించరాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బీఆర్ఎస్ నాయకుల మాటలను నమ్మి యువత తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోవద్దని ఆయన సూచించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ ప్రజలు ఆ పాలనను దగ్గర నుంచి చూశారని ఎంపీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే సుమారు 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి, పారదర్శకంగా నియామకాలు చేపట్టిందని తెలిపారు.
యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ముఖ్యంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని ఆయన వివరించారు.
అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతించాల్సింది పోయి, బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. తెలంగాణ యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.
యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెలంగాణ యువత అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, రాష్ట్ర పురోగతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంపీ స్పష్టం చేశారు. వాస్తవాలను గుర్తించి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన తెలంగాణ యువతకు పిలుపునిచ్చారు.








