తెలంగాణలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయినా యువతకు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు.
ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శిక్షణా కేంద్రాల ద్వారా ప్రతి సంవత్సరం వేలాది మంది యువత ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారని, యువతను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.
అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి పెట్టకుండా వారిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని వంశీకృష్ణ ఆరోపించారు. యువత ఆకాంక్షలను నెరవేర్చకుండా వారిని తప్పుదారి పట్టించడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం తప్ప బీఆర్ఎస్ నాయకత్వం చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలనతో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. యువత రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి, యువత సంక్షేమం, ఉపాధి కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.








