రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా క్షేత్రస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొత్తగూడలో నూతనంగా నిర్మించిన 25 ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలోనూ ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాల అనంతరం రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల జిల్లాకు చేరుకుని, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు నివాసంలో స్వల్ప విరామం తీసుకుని, హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు, కీలక కూడళ్లు, భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ స్వయంగా పరిశీలించారు. పర్యటన పూర్తయ్యే వరకు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని, వాహనాల రాకపోకలను సమర్థవంతంగా నియంత్రించాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.











