మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం, కొత్తపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన గృహాలను రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం ప్రారంభించారు.
కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మంత్రులు, ఎంపీలు కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. ఇంటి యజమానులను అభినందిస్తూ, నూతన గృహాల్లో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, సొంత ఇంటి కల నెరవేరినప్పుడు కుటుంబాల్లో కనిపించే ఆనందమే తమకు సంతోషాన్నిస్తుందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.










