తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో మౌనంగా ఉండి, ఇప్పుడు తెలంగాణపై ప్రేమను ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకమని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాట సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు. తెలంగాణను అవమానించిన వారితోనే రాజకీయ పొత్తులు పెట్టుకుని, ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ఎంపీ వంశీకృష్ణ నిలదీశారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్న ప్రతి సందర్భంలో మౌనం పాటించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు రక్షకుడిలా మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
తెలంగాణ కోసం పోరాడింది, రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, తెలంగాణ హక్కులను కాపాడేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ పేరును ఉపయోగించే వారిని ప్రజలు నమ్మరని, చేతలే ముఖ్యమని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడదని, తెలంగాణ హక్కుల కోసం ఎప్పటికీ ముందుండి పోరాడుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.












