మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని, అభ్యంతరకర పోస్టర్ల వ్యవహారాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
మంగళవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన బల్ల సత్తయ్య, గరిగంటి కొమురయ్యలు, ఈటెల రాజేందర్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కొందరు రాజకీయ ప్రత్యర్థులు ఈ దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడి ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశ్యంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు.
ఈటెల రాజేందర్ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిన ప్రతిసారీ ఇలాంటి ప్రచారాలు తెరపైకి రావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు. అభ్యంతరకర పోస్టర్లు అంటించిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. ఈటెలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఇలాంటి కుట్రలను ఐక్యంగా తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు.
ఈటెల రాజేందర్ ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకుడని, ఇలాంటి దుష్ప్రచారాలు ఆయన ప్రజాదరణను ఏమాత్రం తగ్గించలేవని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు చొప్పరి సోమయ్య, ముదిరాజ్ మహాసభ ఎన్నారై విభాగం స్టేట్ కన్వీనర్ సానబోయిన రాజ్ కుమార్, జిల్లా యువజన అధ్యక్షుడు గరిగే సుమన్, పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












